పవన్ కళ్యాణ్ గారికి ఒక భారతీయుడి బహిరంగ లేఖ

వడియాల రంజిత్ కుమార్


దేశం పట్ల ప్రేమ, మానవత్వం, నిజాయితీ, తప్పు అనిపించిన దానిని ప్రశ్నించే ధైర్యం, ఉన్న మీ వంటి వారు రాజకీయాలలోకి రావడం ఆహ్వానించదగ్గ విషయం. అయితే మీ వల్ల ప్రజలకి మేలు జరగాలి అంటే ఇవి మాత్రమే సరిపోవు. రాను రాను మీ మాటలలో వామపక్ష భావజాలం, వామపక్ష వాదుల ప్రభావం ఎక్కువగా కనిపించడం, దేశ భక్తులకి ఆందోళన కలిగిస్తోంది. కంమ్యునిస్తు సిద్ధాంత లక్ష్యం ఎంతో అద్భుతమైనది. ఎటువంటి బెధాలూ లేకుండా ప్రపంచ మానవాళి అంతా సుఖంగా ఉండటం కన్నా కోరుకోవాల్సింది ఏముంది? అది నిజంగా అద్భుతమే.

అయితే ఒక సిద్ధాంత లక్ష్యం గొప్పది అయినంత మాత్రాన అది గొప్ప సిద్ధాంతం అని అనలేము. ఆ లాక్ష్యాన్ని ఆ సిద్ధాంతం సాధించినప్పుడు మాత్రమే అది గొప్ప సిద్ధాంతం అవుతుంది. ఈ విషయంలో కమ్యునిసం దారుణంగా విఫలమయ్యిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కారణాలు ఏమైనా కంమ్యునిస్టుల చేతిలో పడ్డ ప్రతీ దేశం సర్వ నాశనం అయిపొయింది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు (చైనా అభివృద్ధి వారు స్వేచ్చా వాణిజ్యాన్ని అనుమతించిన తరువాతే ప్రారంభం అయ్యింది), ఉత్తర కొరియా కావచ్చు, క్యూబా కావచ్చు, తూర్పు జర్మనీ కావచ్చు. కమ్యునిస్టులు చెప్పుకొనే విదంగా నార్వే కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ కమ్యునిస్టు దేశాలు కావు. అక్కడ కూడా పెట్టుబడి దారీ విధానమే ఉంది. 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న కమ్యునిస్టులు ఆ రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చెయ్యలేక పోయారు. కేరళ ఒక్కటే కొంత పర్లేదు. దానికి కూడా ప్రధాన కారణం ప్రవాస భారతీయుల నిధులు అనే వాదన ఉంది. కేరళ నుండి ఉద్యోగ నిమిత్తం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు అనే విషయం మీకు తెలియంది కాదు

అది మాత్రమే కాక కమ్యునిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డ దాదాపు అన్ని చోట్లా విపరీతమైన హింస చోటుచేసుకుంది. కోట్ల మంది చంపబడ్డారు. హవాయి విశ్వవిధ్యాలయం, అమెరికా వారి పరిశోధన ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాలచే చంపబడ్డ వారి సంఖ్య 11 కోట్లకి పైమాటే. చంపబడ్డ వారే 11 కోట్ల మంది ఉంటే ఇక మానసిక, శారీరిక, ఆర్ధిక బాధలు అనుభవించిన వారు ఇంకెందరో.

“ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం” పుస్తక ప్రచయితల ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాల చేతిలో చంపబడ్డ వారి సంఖ్య 8.5 నుండి 10 కోట్లు [ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం – Foreword]. అయినా కమ్యునిస్టు పార్టీ కార్యాలయాలలో ఇలా కోట్ల మంది చావుకు కారణమైన స్టాలిన్, మావో ల చిత్ర పటాలని ఇప్పటికీ చూడవచ్చు.

ఎప్పుడైతే ఒక సిద్ధాంత లక్ష్యం, ఆ సిద్ధాంత లక్ష్యం కాకుండా, ఆ సిద్ధాంతం గొప్పది అని నిరూపించడంగా మారుతుందో అప్పుడు ఇక ఆ సిద్ధాంతం ప్రమాదంగా మారుతుంది. కమ్యునిస్టుల పరిస్తితి అదే. వారి సిద్ధాంతంపై వారికున్న వ్యామోహం చివరికి వారిని దేశ ద్రోహులుగా కూడా మారుస్తుంది. భారత – చైనా యుద్ధ సమయంలో వారు చైనాని సమర్ధించడం దీనికో ఉదాహరణ.

కమ్యునిస్ట్ సిద్ధాంతం సఫలం అవ్వడానికి ఆవకాశం ఉందా?

నాకు తెలిసి లేదు. ప్రజాస్వామిక దేశాన్ని కమ్యునిస్టు రాజ్యంగా మార్చాలి అంటే వాళ్లకి పేదరికం అత్యవసరం. వాళ్లకి ఓట్ వేసే వారిలో ఎక్కువ శాతం మంది పేదవారే. పేదవారికే సమానత్వం ఎక్కువగా రుచిస్తుంది. ఎన్నికలలో గెలవాలి అంటే కంమ్యునిస్టులకి పేదల్ని, పేదలుగా ఉంచడం చాలా అవసరం. కమ్యునిస్టు సిద్ధాంత లక్ష్యం పేదరిక నిర్మూలన, కానీ వారి సిద్ధాంత మనుగడకి పేదరికం అత్యవసరం. అందువలన వారు నిరంతరం పేదరికాన్ని నిర్మూలిస్తాము అని వాగ్దానాలు చేసి ఎన్నికలలో గెలిచి ఆ పేదరికాన్ని పెంచి పోషించాలి. అప్పుడు మాత్రమే వారి మనుగడ సాధ్యం. ప్రపంచంలో ఏ ధనిక దేశంలో కూడా కమ్యునిస్టులు లేకపోవడం, మన దేశంలో కూడా అభివృద్ధి జరుగుతున్న కొద్దీ వారు ఉనికిని కోల్పోవడం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో వారి బలం నిలబడి, చివరికి ప్రజాస్వామ్య దేశాన్ని కమ్యునిస్ట్ దేశంగా మార్చాలి అంటే వారికి పేదరికం అత్యవసరం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ, కమ్యునిస్టు వ్యవస్థలో కానీ కమ్యునిస్టు సిద్ధాంతం వలన ప్రయోజనం లేదు, పైగా నష్టం.

దక్షిణాది పై వివక్ష ఉందా?

ఈ మధ్య మీరు తరచుగా కేంద్ర నాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది అని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 7న ట్విట్టర్ ద్వారా “యునైటెడ్ స్టేట్స్ అఫ్ సౌత్ ఇండియా” అనే వ్యాసం పంచుకున్నారు. ఈ వ్యాస రచయిత దక్షిణ భారతం, ఉత్తర భారతం కంటే చాలా అభివృద్ధి చెందిందని, కాబట్టి పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకి దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ నిధులు సమకూరుస్తున్నాయి అని, అయితే కేంద్రం మాత్రం నిధుల మంజూరు విషయంలో పక్షపాత దొరణితో వ్యవహరిస్తూ ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా నిధులు మంజూరు చేస్తోందని ఆరోపించి, దానికి పరిష్కారం అధికార వికేంద్రీకరణ అన్నారు. అలానే దక్షిణ భారత రాష్ట్రాలు ఒక సమూహంగా ఏర్పడి కేంద్రంతో బేర సారాలు సాగించాలని సూచించారు.

వ్యాస ప్రారంభంలో వ్యాస కర్త దక్షిణ భారతం, ఉత్తర భారతం కంటే అభివృద్ది చెందింది అని నిరూపించే ప్రయత్నం చేశారు. అది కొంత మేర నిజమే అయినా, కారాణాలు కూడా చాలానే ఉన్నాయి. మన దేశం మీద గత 1200 సంవత్సరాలలో జరిగిన ఎన్నో దాడులని ఉత్తర భారతీయులే ఎదుర్కొవాల్సి రావడం అందులో ముఖ్యమైనది. అంతే కాక దక్షిణ భారత దేశానికి సముద్ర తీరం ఉండటం కూడా ఇంకో ముఖ్యమైన కారణం.

నేను ఆర్ధికశాస్త్ర నిపునుడిని కాను, అయినప్పటికీ నాకు ఈ వ్యాసంలో భాగమైన, “కేంద్రానికి ఇచ్చిన దానినుండి ప్రతీ రాష్ట్రం తిరిగి ఎంత పొందుతుందో తెలియచేసే రేఖా చిత్రం”, తప్పు అని అర్ధమవుతోంది. ఈ రేఖా చిత్రం ప్రకారం వివిధ కేంద్ర పన్నుల రూపంలో రాష్ట్రాలు ఇచ్చే ప్రతీ రూపాయికీ తిరిగి కేంద్రం 14వ ఆర్ధిక సంఘం కాలం (2015 – 2020) లో ఆంధ్ర ప్రదేశ్ కి 67 పైసలు, కర్నాటకకి 47 పైసలు, కేరళకి 25 పైసలు, తమిళనాడుకి 40 పైసలు, బీహార్ కి 96 పైసలు, ఛత్తీస్గడ్ కి 30 పైసలు, ఉత్తర ప్రదేశ్ కి రూ. 1. 79 పైసలు, మధ్య ప్రదేశ్ కి 75 పైసలు, ఝార్ఖండ్ కి 31 పైసలు ఇస్తుంది. మీరు పంచిన వ్యాసంలో ఉన్న రేఖా చిత్రాన్ని కింద చూడండి

ఇదే నిజమైతే, తాము పన్నుల రూపంలో ఇచ్చే రూపాయికి తిరిగి కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ కి 13 పైసలు, మణిపూర్, మేఘాలయలకి 6 పైసలు, గోవా, మిజోరాం, శిఖ్ఖింలకి 4 పైసలు, ఇస్తున్నట్లు లెక్క. ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? వ్యాస కర్త చెప్తుంది నిజం కాదు. ఈ గణాంకాలు కేంద్రం రాష్ట్రాలకి ఇచ్చే నిధులకి సంబంధించినవి. అంటే, కేంద్రం 14వ ఆర్ధిక సంఘం సమయంలో అన్ని రాష్ట్రాలకీ కలిపి 1 రూపాయి ఇస్తే అందులో ఆంధ్ర ప్రదేశ్ కి 6.7 పైసలు, కర్ణాటకకి 4.7 పైసలు, బిహార్ కి 9.6 పైసలు, ఉత్తర ప్రదేశ్ కి 17.9 పైసలు ఇస్తారు, అని. రాష్ట్రాలనుండి కేంద్రానికి వెళ్ళే పన్నుల గురించి, వ్యాస కర్త చెప్పిన విదంగా పట్టిక 10.3 లో లేవు. వ్యాస కర్త ఉట్టంకించిన దస్త్రం లోని 10.3 పట్టిక చూస్తే విషయం మీకు అర్దమవుతుంది. ఇది అందరినీ తప్పు దోవ పట్టించడమే.

ఈ క్రింది రేఖా చిత్రం చూడండి, విషయం మరింత స్పష్టమవుతుంది. ఇందులో వివక్ష ఎక్కడ ఉంది?

అదే వ్యాసం లో ఉన్న ఇంకో చిత్రం ఇది. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలు తమ తమ GSDP తో పోల్చినప్పుడు ఎక్కువ శాతం నిధులు పొందుతున్నాయి, అని నిరూపించే క్రమం లో చూపిన చిత్రం ఇది

వ్యాస కర్త ఎంతో తెలివిగా ఎక్కువ శాతం నిధులు వెళ్తున్న రాష్ట్రాలని మాత్రమే ఎంచుకుని, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి, దక్షిణాది రాష్ట్రాలకంటే తక్కువ శాతం నిధులు వెళ్తున్న ఇతర ఉత్తరాది రాష్ట్రాలని వదిలేసి, మిమ్మల్ని తెలివిగా తప్పుదోవ పట్టించారు. వాటిని ఒక సారి చూస్తే:

  1. గోవా – 3%
  2. గుజరాత్ – 5%
  3. హర్యాణా – 6%
  4. మహారాష్ట్ర – 2%
  5. పంజాబ్ – 8%
  6. పశ్చిమ బెంగాల్ – 2%

అంతే కాకా దాదాపు అన్ని ఈసాన్య రాష్ట్రాలకు దాదాపు 50% ఇస్తున్నారు. అలానే జమ్మూ కాశ్మీర్ కి 30.4% నిధులు వెళ్తున్నాయి. మరి ఇందులో దక్షిణ భారత దేశం పట్ల వివక్ష ఎక్కడ ఉందో ఆ వ్యాసం రాసిన వ్యక్తికి, దానిని ఏ మాత్రం పరిశీలించకుండా జానల మీదకి వదిలిన మీకే తెలియాలి. వ్యాస కర్త ఆధారంగా చూపిన 14వ ఆర్ధిక సంఘం నివేదిక చూసిన ఎవరికైనా ఈ కేటాయింపులలో మీరన్న ఉత్తర – దక్షిణ వివక్ష లేదు, అనే విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ, కొన్ని రాష్ట్రాలకి తక్కువ నిధులు కేటాయించడం సరైనదా కాదా అనే విషయం చర్చించడం లేదు. అది పూర్తిగా వేరే చర్చ. ఇందులో వివక్ష లేదు అని మాత్రమే నేను ప్రస్తుతానికి నిరూపించ దలుచుకున్నాను. ఈ క్రింది రేఖా చిత్రం విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంది.

2009 – 10 నుండి 2014 – 15 కి సంబంధించిన గణాంకాలని ఈ క్రింది రేఖా చిత్రంలో చూడండి

గణాంకాలు ఇలా ఉంటే, వ్యాసకర్త మాత్రం, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకి గురవుతున్నాయి అని నిరూపించడమే లక్ష్యంగా, తన వాదనకి అనుకూలమైన గణాంకాలని మాత్రమే ఉపయోగించుకొని, లేని వివక్షని చూపించి, దానికి పరిష్కారం అధికార వికేంద్రికరణ అన్నారు. ఫై రేఖ చిత్రాలని చూస్తే మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యాణా లాంటి ఉత్తరాది రాష్ట్రాలకి దక్షినాది రాష్ట్రాల కంటే తక్కువ శాతం నిధులు వెళ్తున్నాయి అన్న విషయం స్పష్టమవుతుంది. మన దేశంలో అధికారం కేవలం కేంద్ర స్థాయిలోనే కాదు, రాష్ట్రాల స్థాయిలో కూడా కేంద్రీకృతమయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయం లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ గారు 25 సంవత్సరాలుగా చెప్పడమే కాక, ఎన్నో నిర్మాణాత్మకమైన సలహాలు కూడా ఇచ్చారు. ఈ విషయం చెప్పడానికి, లేని వివక్షని సృష్టించాల్సిన అవసరం కానీ, ఇలా గణాంకాని వక్రీకరించి సృష్టించిన వివక్షని ఆధారం చేసుకొని కేంద్రంతో బేర సారాలు నెరపడానికి “యునైటెడ్ స్టేట్స్ అఫ్ సౌత్ ఇండియా” ని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం కానీ లేవు. ఈ నిధుల పంపిణీ, గాడ్గిల్ – ముఖర్జీ ఫార్ములా, లాంటి కొన్ని సూత్రాలకి లోబడి జరుగుతుందే తప్పా, కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారం కాదు. ఈ విషయాన్ని మీరు ఎవరైనా మంచి ఆర్ధిక శాస్త్రవేత్తని అడిగి తెలుసుకోగలరు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనీ సమానంగా చూడాలి తప్ప ఆర్ధిక వెనకబాటు తనం, జనాభా వంటి వాటిని ప్రాతిపదికగా తీసుకొని కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ కొన్ని రాష్ట్రాలకి తక్కువ నిధులు మంజూరు చెయ్యడం తప్పు అనేది మీ వాదన ఐతే, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా అడిగే నైతిక హక్కు మీరు కోల్పోతారు. మరి మీరు ప్రత్యేక హోదా అడిగేది కూడా ఆర్ధిక వెనకబాటు తనాన్ని చూపే కద. రాష్ట్రాన్ని విడదీయడమే ప్రత్యేక హోదా అడగడానికి కారణం అయితే మరి తెలంగాణాకి కూడా అడగాలి. అంతే కాక రాష్ట్ర స్థాయిలో కూడా కేటాయింపులు ఇదే విదంగా జరుగుతాయి. మీ మాటలని ఆదర్శంగా తీసుకొని రేపు రాష్ట్ర ఖజానాకి పన్నుల రూపంలో ఎక్కువగా డబ్బు ఇచ్చే జిల్లాలైన కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలు కూడా “యునైటెడ్ డిస్ట్రిక్ట్స్అఫ్ సెంట్రల్ ఆంధ్ర ప్రదేశ్” అని ఏర్పాటు చేస్తాం, అంటే అది మీకు అంగీకారమేనా? దేశ, రాష్ట్ర, జిల్లా, నగర, గ్రామ, కుటుంబ ఇలా అన్ని స్థాయిలలోనూ నిధుల పంపిణీ అవసరాన్ని బట్టే జరుగుతుంది, జరగాలి కూడా. ఒక నగరంలో మురికివాడల నిర్మూలనకి, ఆ ప్రాంతం నుండి పన్నుల రూపంలో వస్తున్న నిధులతో సంబంధం లేకుండా నిధులు మంజూరు చెయ్యడం ధర్మమైతే; తల్లి, తండ్రి చిన్నప్పుడే చనిపోతే కుటుంబ బాధ్యతల కోసం తన చదువుని త్యాగం చేసి కస్టపడి తమ్ముళ్ళనీ, చేల్లెల్లనీ చదివించి, పెళ్ళిళ్ళు చేసిన అన్నగారి కుటుంబాన్ని తరువాతి కాలంలో ఆ తమ్ముళ్ళు, చెల్లెల్లు ఆదుకోవడం ధర్మమైతే; ఒక తండ్రి, అంగ వికలాంగుడైన కొడుక్కి మిగిలిన వాళ్ళ కంటే ఆస్తిలో ఎక్కువ వాటా ఇవ్వడం ధర్మమైతే; కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనకబడిన రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం లాంటి వాటికి ఎక్కువ నిధులు ఇవ్వడం కూడా ధర్మమే.

ఇప్పుడు మీరు పెట్టిన కొన్ని ట్వీట్లకి క్లుప్తంగా జవాబిస్తాను.

2017 ఏప్రిల్ 13న మీరు “దక్షిణాదిలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని విడదీశారు కానీ, ఉత్తరాదిలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ని ఎప్పటికైనా అలా విడదీయగాలరా?” అని ప్రశ్నించారు. 

ఉత్తర ప్రదేశ్ ని మాత్రమే కాదు బీహార్ ని, మధ్య ప్రదేశ్ ని కూడా 2000 సం. లోనే విభజించి ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్ గడ్ రాష్ట్రాలని ఏర్పాటు చేసారు. అంతకన్నా దశాబ్దాల ముందే, అంటే 1966 లోనే పంజాబ్ ని విభజించి హర్యాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు.

జనవరి 20, 2017 జల్లికట్టు గురించి స్పందిస్తూ, “జల్లికట్టు, కొందిపందెం లని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం ద్రావిడ సంస్కృతి మీద దాడి”, అని తేల్చేసారు

దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

  1. జల్లికట్టు అలానే కొండిపందాలని నిషేదించింది సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీమ్ కోర్ట్), కేంద్ర ప్రభుత్వం కాదు.
  2. ఇటువంటి నిషేదాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నిర్వహించే జంతు సంబంధ క్రీడల మీద కూడా ఉన్నాయి.

ఇది తప్పో ఒప్పో పక్కన పెడితే, ఇందులో మీరు బ్రమిస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పాత్ర కానీ, ప్రత్యేకంగా దక్షిణ భారత సంస్కృతిని అణగద్రోక్కడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం కానీ లేదు.

మార్చ్ 17, 2017 న ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ లో వచ్చిన ఒక వార్తని ఉట్టంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లోని రైతుల రుణ మాఫీకి కావాల్సిన నిధులని సమకూర్చడం, దక్షిణ భారత రాష్ట్రాల పట్ల వివక్ష అని తేల్చేసారు

కనీసం మీరు ఉట్టంకించిన వార్తనైనా పూర్తిగా చదివి ఉంటే మీరు ఇలా మాట్లాడరు. ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాక దేశంలో ఇంకా ఎన్నో రాష్ట్రాలలో (ఉత్తర, దక్షిణ, ఈశాన్య) ఇటువంటి డిమాండ్లు ఉన్నాయి అని ఆ వార్తలోనే స్పష్టంగా ఉంది. మరి ఇందులో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఎక్కడ ఉందో మీకే తెలియాలి. అంతే కాకా మీరు ఉట్టంకించిన వార్తా కధనంలో చెప్పిన విధంగా ఉత్తర ప్రదేశ్ రైతుల రుణాల మాఫీ కి అవసరమైన నిధులని కేంద్రం సమకూర్చడం లేదు అని నా అభిప్రాయం. ఇదే విషయమై న్యూ ఇండియా ఎక్ష్ప్రెస్స్ లో మార్చ్ 30 న వచ్చిన వార్తా కధనాన్న అలానే, ఏప్రిల్ 4న, CNBC టీవీ 18 వారి వెబ్సైటు, మనీ కంట్రోల్ లో వచ్చిన వార్తా కధనాన్ని కూడా పరిశీలించండి. మనీ కంట్రోల్ వారి కధనం ప్రకారం, రుణ మాఫీ ఆర్ధిక భారాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుంది. కిసాన్ రాహత్ బాండ్లని ని అమ్మడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆరోపిస్తున్నట్లు కేంద్రం నిధులని సమకూర్చడం లేదు.

అంతే కాక 14వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాని భా.జ.పా ప్రభుత్వం 32% నుండి 42% కి పెంచింది, అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి

మీకు తెలియంది కాదు, అయినా ఒక సామెత తో ఈ లేఖ ని ముగిస్తాను – “పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చనే

ఇట్లు

వడియాల రంజిత్ కుమార్

విశాఖపట్నం

ఉల్లేఖనాలు

Comments

comments